India: కరోనా రికవరీలో భారత్ రికార్డు: జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడి

  • 78 శాతం రికవరీ రేటుతో ప్రపంచంలోనే అగ్రస్థానం
  • రెండు, మూడు స్థానాల్లో బ్రెజిల్, యూఎస్
  • వివరాలు వెల్లడించిన జాన్  హాప్‌కిన్స్ యూనివర్సిటీ

దేశంలో విపరీతంగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ, కరోనా రికవరీలోనూ అదే జోరు కొనసాగుతుండడం కొంత ఊరటనిస్తోంది. తాజాగా, ప్రఖ్యాత జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది.  కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో ప్రపంచంలో భారతీయులే అత్యధికులని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 37,80,107 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రికవరీల్లో నిన్న బ్రెజిల్‌ను దాటేసిందని వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 2.9 కోట్ల మంది కరోనా మహమ్మారి బారినపడగా, వారిలో 1.96 కోట్ల మంది కోలుకున్నట్టు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఇక, ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 9 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా సేకరించిన వివరాల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది.

భారత్‌లో 37,80,107 మంది కోలుకున్నారని, ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని యూనివర్సిటీ పేర్కొంది. భారత్‌లో రికవరీ రేటు 78 శాతంగా ఉందని తెలిపింది. భారత్ తర్వాత 37,23,206 మందితో బ్రెజిల్ రెండో స్థానంలో ఉందని వివరించింది. మూడో స్థానంలో అమెరికా ఉన్నట్టు యూనివర్సిటీ తెలిపింది.

More Telugu News