New Revenue Act Bill: నూతన రెవెన్యూ చట్టం బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం

  • మండలిలో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
  • ఏకగ్రీవ ఆమోదం లభించిందన్న మండలి చైర్మన్
  • వీఆర్వో పోస్టుల రద్దు బిల్లుకు కూడా ఆమోదం
New Revenue Act Bill passed in Telangana Legislative Council

రాష్ట్రంలో భూ సంస్కరణల దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. ఈ నూతన రెవెన్యూ చట్టం బిల్లుకు ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇవాళ ఈ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టగా, అక్కడ కూడా ఆమోదించారు. ఈ బిల్లును సీఎం కేసీఆర్ మండలిలో ప్రవేశపెట్టి సభ్యుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. దీనిపై చర్చ చేపట్టారు. సీఎం కేసీఆర్ సభ్యుల సందేహాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

శతాబ్దాల నాటి భూ వివాదాల పీడ విరగడ అయ్యేందుకు ఈ కొత్త రెవెన్యూ చట్టం ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. నూతన చట్టంతో ఇకపై ధరణి పోర్టల్ ద్వారా మార్పులు చేర్పులు చేసే అధికారం తహసీల్దార్ లకు లేదని తెలిపారు. అరగంటలో భూ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్ డేట్ చేసేందుకు వీలవుతుందని వివరించారు. ఇకమీదట రెవెన్యూ కోర్టులు ఉండవని, వాటి స్థానంలో ఫాస్ట్ ట్రాక్ ట్రైబ్యునళ్లు పనిచేస్తాయని చెప్పారు.

చర్చ అనంతరం కొత్త రెవెన్యూ చట్టం బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. నూతన రెవెన్యూ చట్టం బిల్లుతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, వీఆర్వో పోస్టుల రద్దు బిల్లు, తెలంగాణ మున్సిపల్ నిబంధన సవరణ బిల్లులకు కూడా మండలి ఆమోదం లభించినట్టు చైర్మన్ తెలిపారు.

More Telugu News