Seethakka: అంతా బాగుంటే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు?... సొంత డబ్బాలు కొట్టుకోవడానికా?: సీతక్క ఆగ్రహం

Mulugu MLA Seethakka fires on TRS members in Telangana assembly
  • అసెంబ్లీలో సీతక్క ప్రసంగం
  • అంతా బాగుంది అని చెప్పుకోవడానికి వేరే వేదికలున్నాయని వెల్లడి
  • సమస్యల గురించి మాట్లాడ్డానికే అసెంబ్లీ ఉందని స్పష్టీకరణ
ఇటీవలే బైకెలి నాగులు (55) అనే వ్యక్తి తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ములుగు కాంగ్రెస్ శాసనసభ్యురాలు సీతక్క ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఒక ఉద్యమకారుడు చనిపోతే కనీసం స్థానిక నేతలు నివాళులు అర్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

కళ్లముందు జరిగిన సంఘటనలో మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదని తెలిపారు. నాగులు మృతదేహంపై టీఆర్ఎస్ కండువా కప్పారు కానీ, ఒక్క టీఆర్ఎస్ నేత కూడా అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు రాలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవించాలని, నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగులు అంశంలో హోంమంత్రి ఓ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతుండగా, అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. దాంతో సీతక్క అసంతృప్తికి గురయ్యారు. తమకు జీరో అవర్ లో కూడా మాట్లాడేందుకు సమయం ఇవ్వడంలేదని అన్నారు. తమ గొంతు నొక్కితే ఏమొస్తుందని ప్రశ్నించారు.

అధికార పక్ష సభ్యులు ఆహా, ఓహో అనుకుంటూ తమ సొంత డబ్బాలు కొట్టుకునేందుకు సమయం సరిపోతోందని, ఇతర పార్టీల సభ్యులకు సమయం ఇవ్వడంలేదని మండిపడ్డారు. అంతా బాగుంది అని అధికార పక్ష సభ్యులు చెప్పుకుంటుంటే ఇక అసెంబ్లీ సమావేశాలు జరపడం ఎందుకని ప్రశ్నించారు. అంతా బాగుంది అని చెప్పుకోవడానికి చాలా వేదికలు ఉంటాయని, కానీ సమస్యల గురించి ప్రస్తావించుకోవడానికి ఉన్న వేదిక అసెంబ్లీయేనని స్పష్టం చేశారు.
Seethakka
Assembly
TRS
Congress
Telangana

More Telugu News