Sabitha Indrareddy: త్వరలోనే వీసీలు, అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి సబిత వెల్లడి

Minister Sabitha Indrareddy answers to members questions in Assembly session
  • కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • ప్రైవేటు వర్సిటీలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానాలు
  • రాష్ట్ర వర్సిటీలను నిర్లక్ష్యం చేయడంలేదని స్పష్టీకరణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ బిల్లుపై చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జవాబిచ్చారు. రాష్ట్ర యూనివర్సిటీలను సర్కారు నిర్లక్ష్యం చేయడంలేదని స్పష్టం చేశారు. త్వరలోనే వర్సిటీలకు వీసీలు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. నియామకాలకు ఎప్పుడో అనుమతులు ఇచ్చినా, న్యాయపరమైన సమస్యలు రావడంతో కొంత ఆలస్యం అవుతోందని అన్నారు.

కాగా, తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్లు దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు యూనివర్సిటీల ప్రతిపాదన తీసుకువచ్చామని సబిత వెల్లడించారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సంబంధించి 16 ప్రతిపాదనలు రాగా, 8 ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించిందని, వాటిలో ఐదింటికి ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. మరో మూడింటికి త్వరలోనే ఆమోదం తెలుపుతామని వివరించారు.

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందని తెలిపారు. అంతేకాదు, దేశంలో ఉన్న వర్సిటీల వివరాలను కూడా మంత్రి సభ్యులకు తెలిపారు. దేశవ్యాప్తంగా 53 సెంట్రల్ యూనివర్సిటీలు, 412 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 361 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 124 డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయని వివరించారు.
Sabitha Indrareddy
Private Universities
Telangana
Answers
Assembly

More Telugu News