WHO: ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజులో 3 లక్షల పైగా కరోనా కేసులు... డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

WHO concerns world registered highest number of corona cases in a single day
  • ఉద్ధృతంగా కొనసాగుతున్న కరోనా ప్రభావం
  • నిన్న ఒక్కరోజే 5,537 మరణాలు
  • భారత్ లో ప్రతిరోజూ అత్యధిక కేసులు
కరోనా మహమ్మారి అంతకంతకు తీవ్రమవుతోంది. అనేక దేశాల్లో ఈ వైరస్ ప్రభావం పీక్స్ లో కొనసాగుతోంది. ఫ్రాన్స్ వంటి దేశాల్లో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడం గమనార్హం. తాజాగా ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3,07,930 కేసులు వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. గతంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ రాలేదని వివరించింది. ముఖ్యంగా  భారత్, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో కరోనా ముప్పు అధికంగా ఉందని, ఈ మూడు దేశాల్లో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది.

ఒక్క భారత్ లోనే రోజుకు 90 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తుండడం తెలిసిందే. ఇక, కరోనా ప్రభావిత దేశాల్లో నిన్న ఒక్కరోజే 5,537 మరణాలు సంభవించగా, ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 9,17,417కి చేరింది.

అగ్రరాజ్యం అమెరికా కరోనా గణాంకాల పరంగా టాప్ లో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 65,19,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,94,041 మంది మృత్యువాత పడ్డారు. రెండో స్థానంలో ఉన్న భారత్ లో ఇప్పటివరకు 47,54,356 పాజిటివ్ కేసులు ఉండగా, 78,586 మంది మరణించారు. బ్రెజిల్ లో 43,30,455 పాజిటివ్ కేసులు, 1,31,625 మరణాలు సంభవించాయి.
WHO
Corona Virus
Positive Cases
Deaths
India
USA
Brazil

More Telugu News