YSRCP: వైసీపీ ఎంపీలు మాధవి, రెడ్డప్పలకు కరోనా!

Corona Positive for Another Two YSRCP MPs
  • లక్షణాలు లేకుండానే రెడ్డప్పకు వైరస్
  • జ్వరంతో బాధపడుతూనే సమావేశాలకు మాధవి
  • ఇప్పటికే వైరస్ బారిన పడిన వంగా గీత
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ప్రజా ప్రతినిధులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవిలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.దీంతో వీరిద్దరినీ ఐసోలేషన్ కు వెళ్లాలని అధికారులు సూచించారు. తదుపరి రెండు వారాలూ వీరు ఢిల్లీలోనే ఉండి, చికిత్సను పొందనున్నారు.

కాగా, రెడ్డప్పకు ఎటువంటి లక్షణాలు కనిపించనప్పటికీ కరోనా సోకినట్టుగా తేలిందని తెలుస్తోంది. మాధవికి మాత్రం రెండు రోజులుగా జ్వరం ఉందని, జ్వరంతో బాధపడుతూనే ఆమె లోక్ సభ సమావేశాల నిమిత్తం వచ్చి, పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ గా తేలిందని అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, కాకినాడ ఎంపీ వంగా గీతకు, శనివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ 24 మంది ఎంపీలు, 8 మంది కేంద్ర మంత్రులకు వైరస్ సోకింది. ఏ విధమైన కరోనా లక్షణాలు కనిపించినా, స్వల్ప లక్షణాలున్నా సభలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు.
YSRCP
Reddappa
Vanga Geetha
Madhavi

More Telugu News