Lok Sabha: పార్లమెంట్ చరిత్రలో వినూత్న సమావేశాలు... వీడియో ఇదిగో!

  • సభ్యుల మధ్య భౌతిక దూరం
  • ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి
  • ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం నుంచి లోక్ సభ
  • ప్రశ్నోత్తరాల సమయం రద్దు
Parliament Session Started in Unique Manner

18 రోజుల పాటు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభం అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని కరోనా మహమ్మారి కారణంగా, ఈ సమావేశాలు వినూత్నంగా జరుగుతుండగా, గతంలో కనిపించని దృశ్యాలు ఈ సమావేశంలో కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నారు. ఏ ఒక్క సభ్యుడి పక్కనా, మరో సభ్యుడు కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు లోక్ సభ, ఇటు రాజ్యసభల్లో భౌతిక దూరాన్ని తప్పనిసరి చేశారు. సీట్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా, పాలీ కార్బనేట్ సీట్లను ఏర్పాటు చేశారు.

ఇక, ప్రతి సమావేశాల్లో కనిపించే క్వశ్చన్ అవర్ ఈ సమావేశాల్లో కనిపించదు. ఇక జీరో అవర్ ను సగానికి కుదించారు. రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే సభలు జరుగుతాయి. వారంలో సెలవు లేకుండా ఏడు రోజులూ సభను నిర్వహిస్తారు. కేవలం లిఖిత పూర్వక సమాధానాలు (అన్ -స్టార్డ్ క్వశ్చన్స్) కోరే ప్రశ్నలకు మాత్రమే సంబంధిత మంత్రులు సమాధానం ఇస్తారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకూ, మాత్రమే పనిచేస్తుంది. సభ్యులంతా ఒకేసారి పార్లమెంట్ కు రాకుండా చేసేందుకు ఆపై భోజన విరామం తరువాత మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకూ లోక్ సభ జరుగుతుంది (ఈ ఒక్క రోజు మాత్రం లోక్ సభ కూడా ఉదయమే సమావేశమవుతుంది).

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించగా, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడాన్ని విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. కేవలం తమకు అనుకూలమైన నిర్ణయాలను మాత్రమే ఎన్డీయే అమలు చేస్తోందని, బిల్లులకు ఆమోదం పొందాలన్న తొందర తప్ప, ప్రజల సమస్యలపై చర్చించాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని మండిపడింది.

కాగా, ఈ సమావేశాల్లో మొత్తం 11 బిల్లులు సభ ముందుకు వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఆర్డినెన్స్ లుగా వచ్చిన రైతుల వాణిజ్య బిల్లు, అత్యవసరాలకు మద్దతు ధర బిల్లు, పన్ను విధానాలు, ఎంపీలు, మంత్రుల వేతనాలు, భత్యాల బిల్లు, పీఎఫ్, బీమా, మెచ్యూరిటీ ప్రోత్సాహకాల బిల్లు, పరిశ్రమల వివాదాలు, ట్రేడ్ యూనియన్ల బిల్లు, సంక్షేమ చట్టాల బిల్లు తదితరాలు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి.

More Telugu News