Punjab Former DGP: 29 ఏళ్ల నాటి కేసులో పంజాబ్ మాజీ డీజీపీకి అరెస్ట్ వారెంట్ జారీ.. పోలీసులకు దొరకని ఆచూకీ!

Arrest Warrant Against Former Punjab DGP In 29 Year Old Case
  • 1991లో కనిపించకుండా పోయిన బల్వంత్ సింగ్ అనే ఇంజినీర్
  • మాజీ డీజీపీ సహా మరో ఆరుగురిపై కేసు నమోదు
  • సెక్యూరిటీని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ డీజీపీ సుమేధ్ సింగ్
1991 నాటి కేసుకు సంబంధించి పంజాబ్ మాజీ డీజీపీ సుమేధ్ సింగ్ సైనీకి మొహాలీలోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బల్వంత్ సింగ్ ముల్తానీ అనే వ్యక్తి అదృశ్యమైన కేసుకు సంబంధించి ఈ వారెంట్ ఇచ్చింది. ఈనెల 25వ తేదీన సుమేధ్ ను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు, సుమేధ్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. పంజాబ్ పోలీసు డిపార్ట్ మెంట్ కు చెందిన ఒక ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుమేధ్ ను అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో రెయిడ్ చేసినా ఆయన ఆచూకీ లభించలేదు.

1991లో కనిపించకుండా పోయిన బల్వంత్ సింగ్ చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజం కార్పొరేషన్ లో జూనియర్ ఇంజినీర్ గా పని చేసేవారు. ఆయన అదృశ్య ఘటనతో సంబంధం ఉందనే ఆరోపణలతో గత మే నెలలో సుమేధ్ పై కేసు నమోదైంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో సుమేధ్ పిటిషన్ వేశారు. గత మంగళవారం ఈ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 1న మొహాలీ కోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న మాజీ పోలీస్ ఇన్స్ పెక్టర్ జాగీర్ సింగ్, మాజీ ఏఎస్ఐ కుల్దీప్ సింగ్ లు ఇటీవల అప్రూవర్లుగా మారారు. అనంతరం, ఎఫ్ఐఆర్ లో హత్య కింద పోలీసులు కొత్త ఛార్జ్ లు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 3న సుమేధ్ చండీగఢ్ లోని తన నివాసం నుంచి కనిపించకుండా వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఆయనకున్న జడ్ ప్లస్ సెక్యూరిటీని, సెక్యూరిటీ వాహనాలను, జామర్ వాహనాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు.

1991 నాటి ఘటన వివరాల్లోకి వెళ్తే... సుమేధ్ సైనీపై అప్పట్లో టెర్రరిస్ట్ దాడి జరిగింది. ఆ సమయంలో చండీగఢ్ సీనియర్ ఎస్పీగా ఆయన ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి మొహాలీలో ఉండే బల్వంత్ ను పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. అయితే పోలీస్ కస్టడీ నుంచి బల్వంత్ తప్పించుకున్నాడని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. తాజాగా, బల్వంత్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమేధ్ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది.
Punjab Former DGP
Sumedh Singh Saini
Arrest Warrant
Mohali Court

More Telugu News