YSRCP: అంతర్వేది ఘటన నేపథ్యంలో.. దేవుళ్ల రథాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

  • అంత‌ర్వేదిలో ర‌థం దగ్ధం కావ‌డంతో చ‌ర్య‌లు
  • రథాల వ‌ద్ద‌ నిఘా పెంచాలని నిర్ణ‌యం
  • చ‌ర్య‌లు తీసుకుంటోన్న అధికారులు
  • ప్ర‌ధాన ఆల‌యాల ర‌థాల వ‌ద్ద సీసీకెమెరాలు
security at ratham

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఆలయాల్లో చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వాన్ని తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురి చేస్తోన్న విష‌యం తెలిసిందే. అంత‌ర్వేదిలో ర‌థం దగ్ధం కావ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం ఆ ఘ‌ట‌నపై సీబీఐ విచార‌ణకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మ‌రోసారి ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాల్లో ఉండే రథాల వ‌ద్ద‌ నిఘా పెంచాలని పోలీసు అధికారులు నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేర‌కు ప్రధాన ఆలయాలకు సంబంధించిన రథాలు ఉండే ప్రాంతాలను పోలీసు అధికారులు ప‌రిశీలిస్తున్నారు.

ఆయా ఆలయ అధికారులతో సమీక్షలు జ‌రుపుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ద్వారక తిరుమల శ్రీవారి పాత రథ సంరక్షణార్థం దేవస్థానం ఇప్ప‌టికే ఆర్‌సీసీ రూఫ్‌ కలిగిన రథశాలను నిర్మించింది. శ్రీ‌వారి ఉత్సవాల స‌మ‌యంలో దీన్ని తీస్తారు. అనంత‌రం ర‌థ‌శాల‌లో పెట్టి ఇనుప ద్వారాల‌కు తాళాలు వేస్తారు.

ఇప్పుడు అదే విధంగా లక్ష్మీపురం ఆలయం వద్ద ఉన్న రథశాలల్లో కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలను పరిరక్షిస్తున్నారు. ఇటువంటి చ‌ర్య‌ల‌ను జిల్లాలోని ప‌లు ప్ర‌ధాన ఆల‌యాల వ‌ద్ద తీసుకుంటున్నారు. కాగా, శ్రీవారి రథం, కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలు ఉండే రథశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌నున్నారు. ఆయా ర‌థాలు ఉండే చోట్ల భ‌ద్ర‌త‌ను పెంచారు. ద్వారక తిరుమల దేవస్థానం అధికారులు మూడు రథాలకు ఇన్సురెన్స్‌ చేయించారు.  

More Telugu News