Nara Lokesh: జగన్ దగ్గర మార్కుల కోసం.. కొందరు ఖాకిస్టోక్రసీ ప్రదర్శిస్తున్నారు: నారా లోకేశ్

  • పత్రికా స్వేచ్ఛను హరించడానికి కొందరు పోలీసులు వెనుకాడటం లేదు
  • జగన్ వల్ల కొందరు అధికారులు ఇప్పటికే ఊచలు లెక్కపెట్టారు
  • మనం ఖాకిస్వామ్యంలో ఉన్నామా అని కోర్టు కూడా ప్రశ్నించింది
Some police are not perorming their duties well says Nara Lokesh

రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు తమ విధులను సరిగా నిర్వహించడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. పత్రికా స్వేచ్ఛను హరించడానికి కూడా పోలీసులు వెనుకాడటం లేదని మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. గతంలో కూడా ఇలాగే చేసిన కొందరు అధికారులు జగన్ తో కలసి జైలు ఊచలు లెక్కపెట్టారని చెప్పారు.

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అని హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జగన్ రెడ్డిగారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, ఖాకిస్టోక్రసీని కొందరు అధికారులు ప్రదర్శిస్తున్నారని ట్వీట్ చేశారు.

వాస్తవాలను ప్రసారం చేశారనే అక్కసుతో తెలుగువన్.కామ్ ఎండీ రవిశంకర్ పై అక్రమ కేసు పెట్టి వేధించారని లోకేశ్ మండిపడ్డారు. ఈ కేసును కోర్టు కొట్టివేయడం అరాచకవాదులకు చెంపపెట్టని అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

More Telugu News