East Godavari District: కాకినాడలో కలకలం రేపిన విషవాయువులు.. జనం పరుగులు

Gas leak in Kakinada people fears
  • ఆటోనగర్ శివారులో తీవ్ర దుర్గంధం
  • భయంతో పరుగులు తీసిన ప్రజలు
  • ప్రమాదకరమైన అమోనియాగా గుర్తింపు
కాకినాడలోని ఆటోనగర్ శివారులో విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం వెలువడడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే విషవాయువుల లీకేజీల గురించి విన్న స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు లారీ డ్రైవర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిశ్రమలశాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. కాగా, లీకైన వాయువును ప్రాథమికంగా ప్రమాదకరమైన అమోనియాగా గుర్తించారు.

రెండు అగ్నిమాపక శకటాలతో వాయువులపై నీళ్లు చల్లడంతో వాయువు గాఢత తగ్గింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలతో నిండిన పది డ్రమ్ములను విడిచిపెట్టారని, వాటి నుంచే విష వాయువులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
East Godavari District
Kakinada
Gas leak
ammonia

More Telugu News