చిరంజీవి సినిమాలో ప్రముఖ యంగ్ హీరోయిన్?

11-09-2020 Fri 13:07
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి
  • తమిళ హిట్ చిత్రం 'వేదాళం'కి రీమేక్  
  • అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో సాగే కథ
  • చెల్లెలి పాత్రలో సాయిపల్లవి?
Young heroine in Chiranjeevis movie
మెగాస్టార్ చిరంజీవికి నేటి ప్రముఖ యంగ్ హీరోయిన్ చెల్లిగా నటించనుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో ప్రచారంలో వుంది. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరంజీవి తదుపరి చేయాల్సిన చిత్రాలలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కూడా వుంది. తమిళంలో హిట్టయిన 'వేదాళం' రీమేక్ గా దీనిని రూపొందించనున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ఆధారంగా సాగే కథతో తెరకెక్కుతుంది. చెల్లెలి పాత్రకు కూడా కథలో చాలా ప్రాముఖ్యత వుంది. దీంతో ఆ పాత్రకు ప్రముఖ యువ కథానాయికను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

ఈ క్రమంలో సాయిపల్లవి పేరును వారు పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. సాయిపల్లవి మంచి నటి కాబట్టి, అభినయానికి ఆస్కారం వున్న ఆ పాత్రకు ఆమె బాగా సరిపోతుందని, పాత్రకు న్యాయం చేస్తుందని భావిస్తున్నారట. మంచి పాత్ర కాబట్టి సాయిపల్లవి కూడా కాదనకపోవచ్చు. మరి, ఈ వార్తలో వాస్తవం ఎంతుందనేది త్వరలో తెలుస్తుంది.

ఇదిలావుంచితే, మెహర్ రమేశ్ చిత్రంతో పాటు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందే 'లూసిఫర్' రీమేక్ లోను, బాబి దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ కూడా చిరంజీవి నటించనున్నారు. వాటికి సంబంధించిన పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.