Reliance: అమెజాన్ తో మెగాడీల్ వార్త అవాస్తవం: రిలయన్స్ వర్గాలు

  • నిన్న వచ్చిన వార్తలతో భారీగా లాభపడ్డ సంస్థ ఈక్విటీ
  • ఈ వార్త సత్యదూరమన్న రిలయన్స్ వర్గాలు
  • స్పందించేందుకు నిరాకరించిన అమెజాన్
Reliance Clarifies that Mega Deal with Amazon is Incorrect

తమ రిటైల్ వ్యాపారంలో భారీ వాటాను అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు విక్రయించనున్నట్టు వచ్చిన వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖండించింది. ఈ వార్త నిన్న మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడంతో, స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఈక్విటీ ఆల్ టైమ్ రికార్డుకు చేరగా, సంస్థ మార్కెట్ కాప్ రూ. 15 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ లో 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) అమెజాన్ పెట్టుబడిగా పెట్టనుందని తొలుత 'బ్లూమ్ బర్గ్' ప్రచురించగా, ఆపై అన్ని వార్తా సంస్థలూ ప్రచురించాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లో 40 శాతం వాటాను అమెజాన్ సొంతం చేసుకోనుందన్నది ఈ వార్త సారాంశం.

ఇక ఈ వార్త సత్యదూరమని రిలయన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇరు కంపెనీల మధ్యా భాగస్వామ్యం దిశగా ఎటువంటి ప్రయత్నాలూ జరగడం లేదని సంస్థ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారని గ్లోబల్ న్యూస్ ఏజన్సీ 'ఏఎఫ్పీ' పేర్కొంది. ఇదే విషయమై అమెజాన్ ప్రతినిధిని సంప్రదించగా, స్పందించేందుకు నిరాకరించారు.

కాగా, భారత ఆన్ లైన్ మార్కెట్లో తనదైన ముద్రను వేసేందుకు ఇండియాలో అత్యంత విలువైన సంస్థగా ఉన్న రిలయన్స్, జియో మార్ట్ పేరిట గత మేలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో జియో మార్ట్ కు పోటీ అంటే, అవి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లే. ఈ సమయంలో రిలయన్స్ తో అమెజాన్ మెగా డీల్ కుదుర్చుకోనుందని వచ్చిన వార్తలు సంచలనాన్నే కలిగించాయి.

More Telugu News