NTR: కేసీఆర్ కు నందమూరి ఫ్యామిలీ ధన్యవాదాలు!

Nandamuri Family Thanks to KCR
  • తెలంగాణ పాఠ్యాంశంగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర
  • నేటి తరం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది
  • ఓ ప్రకటనలో నందమూరి రామకృష్ణ
తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చడంపై నందమూరి ఫ్యామిలీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు నందమూరి రామకృష్ణ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"నందమూరి కుటుంబం తరఫున నేను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం కే చంద్రశేఖరరావుకు, ఇతర మంత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. కేవలం నేను మాత్రమే కాదు. రెండు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఈ నిర్ణయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరికీ గర్వకారణం.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర తరతరాల విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది. ఆయన జీవితంలోని క్రమశిక్షణ, నిజాయతీ తదితరాలను గురించి ఈ తరం విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదరికం నుంచి వచ్చి, పేదరికాన్ని పారద్రోలేందుకు ఆయన చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం. సమాజంలో అసమానతలు తొలగాలని ఆయన ఎంతో శ్రమించారు. నేటి తరం బాలలు, రేపటి భావి భారత పౌరులుగా మారే దశలో ఎన్టీఆర్ జీవిత పాఠం వారికి మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు" అని నందమూరి రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.
NTR
KCR
Nandamuri Ramakrishna
Text Books
Telangana

More Telugu News