KCR: ఇదేదో తెలంగాణకు మాత్రమే వచ్చిన విపత్తు కాదు... సందు దొరికింది కదా అని బద్నాం చేయాలని చూడొద్దు: సీఎం కేసీఆర్

  • తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగం
  • భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడి
  • అందుకే అవగాహన కల్పిస్తున్నామని స్పష్టీకరణ
  • జాతీయ స్థాయిలో తెలంగాణలో తక్కువ మరణాలని వివరణ
CM KCR refutes opposition claims in Assemble sessions

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, చికిత్స తీరుతెన్నుల అంశాల్లో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టేందుకు ఆయన ప్రయత్నించారు. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం ఉందని, ఇదేదో తెలంగాణకు మాత్రమే వచ్చిన విపత్తు అన్నట్టుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని, ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. సందు దొరికింది కదా అని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూడొద్దని హితవు పలికారు.

కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నామని, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. తమది బాధ్యత గల ప్రభుత్వం కాబట్టే, ప్రజలను భయాందోళనలకు గురిచేసే ప్రకటనలకు బదులు భరోసా ఇచ్చేలా మాట్లాడుతున్నామని అన్నారు. ఈ విషయంలో భట్టి విక్రమార్క పునరాలోచన చేయాలని హితవు పలికారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, అక్కడేం చేస్తున్నారో ఓసారి గమనించాలని తెలిపారు.

కరోనా మరణాల గురించి చెబుతూ, వ్యాధి కంటే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు. సమాజంలో జరుగుతున్నది ఇదేనని స్పష్టం చేశారు. ఈ విషయం గుర్తించే తాము ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని, అందుకే జాతీయస్థాయిలో తెలంగాణలో కరోనా మరణాలు తక్కువగా వస్తున్నాయని వెల్లడించారు.

అంతేతప్ప, కరోనా మరణాలను తాము దాచిపెడుతున్నామని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఎవరైనా చావులు దాచిపెట్టగలరా అధ్యక్షా అంటూ అడిగారు. మరణాలపైనా అబద్ధాలు ఆడితే అది ప్రతిపక్షం అనిపించుకోదని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం కరోనా నివారణ పరంగా ఎంతో మెరుగ్గా ఉందని, కేసీఆర్ ఇంకా బతికే ఉన్నాడని, రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగం కానీయడని స్పష్టం చేశారు.

More Telugu News