Tomato: తెలంగాణలో అమాంతం పెరిగిన టమాటా ధర!

  • భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న టమాటా పంట
  • ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతి
  • బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ. 60
Tomato price in Telangana Hiked

తెలంగాణలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. గత పది రోజుల్లో కిలో టమాటాపై ఏకంగా రూ. 30 పెరగడంతో కేజీ టమాటా ధర ఇప్పుడు రూ. 60 పలుకుతోంది. భారీ వర్షాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం వల్లే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే నెల చివరి వరకు ఈ ధరలే కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి రాష్ట్రంలో వినియోగించే టమాటాలో తెలంగాణలో సాగవుతున్నది 20 శాతం వరకే. మిగతా దానికోసం దిగుమతులపై ఆధారపడాల్సిందే. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్గొండ తదితర ప్రాంతాల్లోని పంట దెబ్బతింది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ధర ఒక్కసారిగా కొండెక్కింది.

ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి టమాటా దిగుమతి అవుతోంది. ఫలితంగా ఆగస్టు తొలి వారంలో కిలో టమాటా రూ. 30 పలికింది. అయితే, లాక్‌డౌన్ సడలింపుల కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోవడంతో వినియోగం పెరిగింది. దీంతో ధర ఒక్కసారిగా రూ. 50-60కి పెరిగింది.

గత నెలలో వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు గరిష్ఠంగా మూడు వేల క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా, గత పది రోజులుగా 2 వేల క్వింటాళ్లలోపే వస్తోంది. ధరలు అమాంతం పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని రైతు బజార్లలో ప్రస్తుతం కిలో టమాటా రూ. 45 వరకు ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. అక్టోబరు చివర్లో పంట చేతికి వస్తుందని, అప్పటి వరకు ధరలు ఇలానే ఉండొచ్చని వ్యాపారులు చెబుతున్నారు.

More Telugu News