Health Ministry: దేశంలో 70 శాతం మరణాలు ఈ ఐదు రాష్ట్రాల నుంచే!: కేంద్ర ఆరోగ్యశాఖ

  • ఏపీ, తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు, యూపీల్లో మరణాలు
  • దేశంలో తగ్గుతున్న కరోనా మరణాలు
  • ప్రస్తుతం జాతీయ సగటు 1.70 శాతం
Union Health Ministry reveals corona statistics of nation and states

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో కరోనా ప్రభావంపై వివరాలు వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని, ఆగస్టు మొదటివారంలో 2.15 శాతం ఉంటే ఇప్పుడది 1.70 శాతానికి వచ్చేసిందని పేర్కొంది. అయితే, దేశంలో నమోదవుతున్న కరోనా మరణాల్లో అత్యధికం ఐదు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలో 70 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని వివరించారు.

అంతేకాకుండా, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 శాతం కేసులు వస్తున్నాయని అన్నారు. దేశం మొత్తమ్మీద 5 వేలకు తక్కువగా కొవిడ్ కేసులు ఉన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 14 ఉన్నాయని తెలిపారు. 28 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాల రేటు జాతీయ సగటు 1.70 శాతం కన్నా ఎక్కువగా ఉందని రాజేశ్ భూషణ్ వివరించారు. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 53 కరోనా మరణాలు సంభవిస్తున్నాయని, ప్రపంచంలో అతి తక్కువ మరణాలు నమోదవుతున్న దేశాల్లో మనమూ ఉన్నామని పేర్కొన్నారు.

భారత్ లో ఇవాళ 75,809 కొత్త కేసులు రాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,422కి పెరిగింది. ఒక్కరోజులో 1,133 మంది చనిపోవడంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 72,775కి చేరింది. దేశంలో ఆగస్టు 7 నాటికి 20 లక్షల కరోనా కేసులు ఉండగా, సెప్టెంబరు 5 నాటికి అది రెట్టింపైంది.

More Telugu News