Chandrababu: ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కులు ధరిస్తున్నారు... ఈ ముఖ్యమంత్రికి ఏమైంది?: చంద్రబాబు

  • సీఎం మాస్కు పెట్టుకోకపోవడం క్షమించరాని నేరమన్న చంద్రబాబు
  • మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు
  • టీడీపీ సీనియర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
Chandrababu questions CM Jagan why does not wear a mask

టీడీపీ సీనియర్ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి మాస్కు ధరించకపోవడం క్షమించరాని నేరం అని అన్నారు. ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కు ధరిస్తున్నారని, మన రాష్ట్రంలో సీఎం, మంత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  

సీఎం జగన్ అన్నీ అసత్యాలే చెబుతుంటారని అన్నారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాడు బిగించడం హేయమని పేర్కొన్నారు. వైసీపీ దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్టానికి చెడ్డపేరు తెచ్చారని, కియా మోటార్స్ రాష్ట్రానికి రావడం వైసీపీకి ఇష్టం లేదని తెలిపారు. వైసీపీ బెదిరింపుల కారణంగానే కియా 17 యూనిట్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వెల్లడించారు.

జగన్ సీఎం అయ్యాక ఏపీలో ఎస్సీలపై దాడులు జరగని రోజంటూ లేదని అన్నారు. ప్రతి జిల్లాలో వైసీపీ బాధిత ఎస్సీ కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. వైసీపీ వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ మంత్రులను నిలదీస్తుండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనాలని తెలిపారు.

More Telugu News