India: సరిహద్దులు దాటివచ్చిన 13 జడల బర్రెలను, 4 దూడలను చైనా సైన్యానికి అప్పగించిన భారత్!

Indian Army Handedover 13 Yaks to china Army
  • సరిహద్దుల వద్ద తిరుగాడుతున్న జంతువులు
  • మానవత్వంతో అప్పగించామన్న భారత్
  • కృతజ్ఞతలు తెలిపిన చైనా అధికారులు
అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ దాటి సంచరిస్తున్న చైనాకు చెందిన 13 జడల బర్రెలు, 4 దూడలపై మానవత్వం చూపుతూ, వాటిని చైనా సైన్యానికి భారత జవాన్లు అప్పగించారు. ఈ విషయాన్ని వెల్లడించిన ఈస్ట్రన్ కమాండ్, వీటిని స్వీకరించిన చైనా అధికారులు, కృతజ్ఞతలు తెలిపారని ట్వీట్ చేసింది. "ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో ఇవి తిరుగుతూ కనిపించాయి. వీటిపై మానవత్వం చూపిస్తూ, ఈ నెల 7వ తేదీన చైనా అధికారులకు అప్పగించాము" అని పేర్కొంది.

చైనా సరిహద్దుల్లో నిత్యమూ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడి, ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి చర్యలు ఉద్రిక్తతలు తగ్గేందుకు సహకరిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, చైనా ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నరవణే గత వారం చివర్లో లడఖ్ లో పరిస్థితిని సమీక్షించిన అనంతరం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం రెండు దేశాల జవాన్లూ ప్రయత్నాలు జరుపుతున్నారు. ఫింగర్ గాల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. గత జూన్ లో చైనా దళాలతో పోరులో 20 మందికి పైగా భారత జవాన్లు అమరులైన తరువాత ఈ ప్రాంతంలో పరిస్థితులు క్షీణించాయి.
India
China
Yaks
Claves

More Telugu News