Jayaprakash Reddy: 'కోడ్తే... కూజాలు చెంబులవుతాయ్...' ఇదే జయప్రకాశ్ చివరి డైలాగ్... జీవిత విశేషాలు!

  • విలనిజంలోనూ కామెడీ పండించిన జయప్రకాశ్
  • సమరసింహారెడ్డితో తొలి సూపర్ బ్రేక్
  • దాసరికి పరిచయం కావడంతో తొలి సినిమాలో అవకాశం
Tollywood Actor Jayaprakash Life Moments

ఎన్నో విలక్షణ పాత్రలను పోషించి, విలనిజంలోనూ తనదైన శైలిలో కామెడీని పండించడంతో పాటు,సీరియస్ ప్రతినాయకుడి పాత్రలను పోషించిన టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి, ఈ ఉదయం కన్నుమూశారన్న వార్త సినీ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన చిట్టచివరి సినిమా మహేశ్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' కాగా, అందులో 'కోడ్తే... కూజాలు చెంబులవుతాయ్' అనే డైలాగ్ ఎంతో పాప్యులర్ అయింది.

 తన సినీ కెరీర్ లో వందలాది సినిమాల్లో నటించిన జయప్రకాశ్ రెడ్డికి, తొలి బ్రేక్ వచ్చింది మాత్రం బాలకృష్ణ హీరోగా నటించిన 'సమరసింహారెడ్డి'తోనే. ఆ సినిమాతోనే ఓ కరుడుకట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటాడన్న విషయాన్ని సినీ ప్రేక్షకులకు జయప్రకాశ్ రుచిచూపించారు. పగలు, ప్రతీకారాల కోసం కొత్త తరం మారినా, తమ తరం మారబోదంటూ, సినిమా క్లయిమాక్స్ లో ఆత్మహత్య చేసుకోవడం ఆ సినిమాను అప్పట్లో సూపర్ హిట్ గా నిలిపి, కలెక్షన్ల వర్షం కురిపించడంలో తనవంతు పాత్రను ఆయన పోషించారు.

జయప్రకాశ్ రెడ్డి, కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో ఎస్ఐగా పనిచేస్తున్న సాంబిరెడ్డి దంపతులకు జన్మించాడు. నెల్లూరులోని పత్తేకాన్‌ పేటలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను, ఆపై రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలోనూ చదువుకున్నారు. జయప్రకాశ్ టెన్త్ లో ఉండగా, సాంబిరెడ్డికి అనంతపురానికి ట్రాన్స్ ఫర్ కావడంతో, అక్కడికి వెళ్లి, సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ చదివారు. నాటకాలంటే ఆ వయసులోనే అమితాసక్తిని చూపేవారు. సాంబిరెడ్డికి కూడా నటనపై ఆసక్తి ఉండటంతో, తండ్రీకొడుకులు కలిసి పలు నాటకాల్లో నటించారు. డిగ్రీ తరువాత టీచర్ ట్రయినింగ్ పూర్తి చేసుకుని, గణితం ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు.

నల్గొండలో జయప్రకాశ్ రెడ్డి 'గప్ చుప్' అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు చూసి, అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశారు. ఆపై ఆయన 1988లో వెంకటేశ్ హీరోగా వచ్చిన 'బ్రహ్మపుత్రుడు' చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. 1997లో వచ్చిన 'ప్రేమించుకుందాం రా' సినిమా ఆయనలోని ప్రతినాయకుడిని పరిచయం చేయగా, దాని తరువాత వచ్చిన 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' తదితరాలతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

తన కెరీర్ లో జయప్రకాశ్ రెడ్డి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. చిత్రం భళారే విచిత్రం, ఆనందం, అల్లరిరాముడు, చెన్నకేశవ రెడ్డి, లాహిరి లాహిరి లాహిరిలో, కబడ్డీ కబడ్డీ, ఎవడి గోల వాడిదే, ఛత్రపతి, విక్రమార్కుడు, ఆట, రెడీ, కింగ్, ప్రస్థానం, నిప్పు, అడ్డా, షాడో, గలాట, జంప్ జిలానీ, ప్రతినిధి, సౌఖ్యం, పండగ చేస్కో, సుప్రీం, నేనే రాజు నేనే మంత్రి, ఎమ్ఎల్ఏ, అమర్ అక్బర్ ఆంటోనీ, సిల్లీ ఫెలోస్, వరల్డ్ ఫేమస్ లవర్ తదితర ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించగా, విడుదలైన చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు.

ఇక డైలాగులు చెప్పడంలోనూ జయప్రకాశ్ ఎంతో దిట్ట. రాయలసీమ మాండలికంలో ఆయన చెప్పిన ఎన్నో డైలాగులు చిరకాలం సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. "ఏమి రా నోరు లేచ్చండాదే?" అన్నా... "ఒరేయ్ పులీ! ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్నావ్, బోడెమ్మ లెక్క!" అని డైలాగ్ కొట్టానా, "పెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?" అంటూ చెప్పిన డైలాగులను ఎవరూ మరచిపోలేరు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్తతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపాలు తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు.

More Telugu News