Amarinder Singh: మా రాష్ట్ర వ్యవహారాల్లో తల దూర్చొద్దు: కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం ఫైర్

  • ఆక్సీమీటర్లు తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలంటూ కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు
  • జనాలు ఆసుపత్రులకు వెళ్లకుండా మీవాళ్లు చేస్తున్నారన్న అమరీందర్
  • ముందు మీ కార్యకర్తలకు కళ్లెం వేయాలని హితవు
Stay out of Punjab says Amarinder Singh to Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మండిపడ్డారు. పంజాబ్ లోని ఆప్ కార్యకర్తలందరూ ఆక్సీమీటర్లు తీసుకుని ప్రజల రక్తంలో ఆక్సిజన్ స్థాయుల్ని కొలవాలని, తద్వారా కరోనా పేషెంట్లను గుర్తించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దీనిపై అమరీందర్ సింగ్ స్పందిస్తూ... మీ ఆక్సీమీటర్లు మాకు అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో ఉన్న మీ కార్యకర్తలు ప్రజలను ఆసుపత్రులకు వెళ్లనీయకుండా, వారంతట వారే కరోనా టెస్టులు చేసుకునేలా చేస్తున్నారని... ముందు మీవారికి కళ్లెం వేయాలని సూచించారు.

కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని... ఆక్సీమీటర్లను తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలంటూ కేజ్రీవాల్ చెప్పడం... తమ ప్రభుత్వాన్ని కించపరచడమే అవుతుందని అన్నారు. తమ రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చవద్దని అన్నారు. మరోవైపు పంజాబ్ లో ఇప్పటి వరకు 57 వేల వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. 1,618 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

More Telugu News