Mamata Banerjee: మా రాష్ట్రంలో 75 శాతం మంది జేఈఈ పరీక్షలు రాయలేకపోయారు: కేంద్రంపై మమతాబెనర్జీ ఫైర్

  • పశ్చిమబెంగాల్ లో కేవలం 1,167 మంది మాత్రమే జేఈఈ రాశారు
  • కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం దారుణం
  • లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు లేకుండా చేయడం దారుణం
Mamata Banerjee hits out at Centre on JEE exams

కరోనా నేపథ్యంలో నిన్న జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలను పశ్చిమబెంగాల్ లోని 75 శాతం మంది విద్యార్థులు రాయలేకపోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,652 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా... కేవలం 1,167 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. కరోనా కారణంగా విద్యార్థులు అవకాశాన్ని కోల్పోయారని అన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహించడం దారుణమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని మండిపడ్డారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని కోరారు.

అన్ లాక్-4 నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోకల్ లాక్ డౌన్ ను విధించకూడదనే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులపై కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలో లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు లేకుండా చేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం నమ్మాలని చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసినంత మాత్రాన సరిపోదని... వాటిని అమలు చేయాల్సింది రాష్ట్రాలేనని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో జిల్లా యంత్రాంగానికే తెలుస్తుందని అన్నారు. ఫెడరలిజంకు ఇదే కీలకమని చెప్పారు. కోల్ కతా మెట్రో రైలు సేవలను ప్రారంభించే అంశంపై ఈ నెల 15 లోపల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News