China: అణ్వాయుధాలను రెట్టింపు చేసుకోనున్న చైనా: పెంటగాన్ ఆరోపణలు

Pentagaon Report on China War Heads
  • యూఎస్ కాంగ్రెస్ కు పెంటగాన్ నివేదిక
  • ముడి సరుకు కూడా సిద్ధంగానే ఉంది
  • ప్రస్తుతం చైనా వద్ద 200 వార్ హెడ్స్

తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను రెట్టింపు చేసుకునే దిశగా, చైనా ప్రణాళికలు రూపొందిస్తోందని అమెరికా ఆరోపించింది. ప్రస్తుతం చైనా వద్ద 200 వార్ హెడ్స్ ఉండగా, వచ్చే పదేళ్లలో వాటిని 400 చేయాలన్న ఆలోచనలో ఉందని, వీటిల్లో భూమి, గాలి, నీటిపై నుంచి ప్రయోగించే అణ్వాయుధాలు ఉండేలా చూసుకుంటోందని పెంటగాన్ అధికారి ఒకరు ఆరోపించారు. యూఎస్, రష్యా, చైనాల మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం కుదరాలని అమెరికా కోరుతున్న వేళ, ఈ ఆరోపణలు రావడం ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.

చైనా మిలిటరీ సామర్థ్యంపై వార్షిక రిపోర్టును తయారు చేసిన పెంటగాన్ అధికారులు, దాన్ని యూఎస్ కాంగ్రెస్ కు పంపారు. వారి వద్ద కనీసం 200 వరకూ వార్ హెడ్స్ ప్రస్తుతం ఉన్నాయని ఈ రిపోర్టులో తొలిసారిగా అధికారులు అంచనా వేశారు. అయితే, ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ విభాగం మాత్రం చైనా వద్ద 320కి పైగా అణ్వాయుధాలున్నాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతం చైనా వద్ద ఉన్న ముడి సరుకుతో సులువుగానే వార్ హెడ్స్ సంఖ్యను రెట్టింపు చేసుకోగలదని, వాటిని ప్రయోగించేందుకు కావాల్సిన మిసైల్స్ కూడా చైనా వద్ద సిద్ధంగానే ఉన్నాయని పెంటగాన్ పేర్కొంది.

కాగా, ఇటీవల చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురిస్తూ, సమీప భవిష్యత్తులోనే న్యూక్లియర్ వార్ హెడ్స్ సంఖ్యను 1000కి చేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించింది. గత సంవత్సరం అక్టోబర్ లో తమ వద్ద గాల్లో నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించే అత్యంత అధునాతనమైన రీ ఫ్యూయలింగ్ బాంబర్ హెచ్-6ఎన్ తయారైందని చైనా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అణ్వాయుధాల విషయంలో చైనా ద్వైపాక్షిక ఒప్పందంలో చేరాలని అమెరికా కోరుతుండగా, చైనా అందుకు ఆసక్తిని చూపించడం లేదు. ప్రస్తుతం చైనా వద్ద ఉన్న అణ్వాయుధాలతో పోలిస్తే, అమెరికా వద్ద 20 రెట్లు అధిక వార్ హెడ్స్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News