Vijayawada: అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందంపై వైసీపీ కార్యకర్తల దాడి

  • విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఘటన
  • హోటల్‌లో భోజనం చేస్తున్న వారిపై నందిగం సురేశ్ అనుచరుల దాడి
  • అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని తీరుతామన్న పట్టాభిరాం
YCP Workers attacked TDP Leaders in Vijayawada

కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందంపై వైసీపీ కార్యకర్తలు కొందరు దాడికి దిగారు. మైనింగ్ పరిశీలనకు వెళ్లిన బృందం తిరిగివచ్చి విజయవాడ శివారులోని ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా ఈ దాడి జరిగింది. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే తమపై దాడికి దిగినట్టు టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. బూతులు తిడుతూ తనపై దాడికి పాల్పడినట్టు టీడీపీ నేత పట్టాభిరాం వద్ద పనిచేస్తున్న అజయ్ చెప్పారు. మైనింగ్ వ్యవహారాలతోపాటు తమ నాయకుడి జోలికి వస్తే చంపేస్తామని తనను బెదిరించారని అజయ్ పేర్కొన్నారు.

దాడి ఘటనపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం స్పందించారు. వైసీపీ నేతల అక్రమాలపై వెనకడుగు వేయబోమన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ సీనియర్ నేతల బృందాన్ని కూడా కొండపల్లి అక్రమ మైనింగ్ పరిశీలనకు పంపుతామని పేర్కొన్నారు. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News