Madhavi Latha: టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్.. సీరియస్ గా తీసుకోండి: సినీ నటి మాధవీలత

Madhavilatha Sensational Comments on Tollywood Drugs
  • సుశాంత్ ఆత్మహత్య తరువాత మరోసారి చర్చ
  • తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి
  • ఫేస్ బుక్ లో మాధవీలత
సినీ ప్రపంచంలో డ్రగ్స్ దందాపై సుశాంత్ ఆత్మహత్య తరువాత మరోసారి చర్చ మొదలైన వేళ, బీజేపీ నేత, నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ డ్రగ్స్ దందా సాగుతోందని చెప్పారు. టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ ను వాడుతుంటారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు దృష్టిని సారించాలని కోరింది. టాలీవుడ్ నటీనటులను వదిలేయకుండా, సీరియస్ గా తీసుకుని విచారించి, ఈ దందాను అంతం చేయాలని కోరారు.

కాగా, ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ డ్రగ్స్ వాడేవాడన్న ఆరోపణల నేపథ్యంలో, వాటిని రియా స్వయంగా తీసుకెళ్లి ఇచ్చేదని, ఓ డీలర్ తో ఆమె ఫోన్ సంభాషణలు జరిపిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కన్నడ చిత్ర పరిశ్రమలోనూ మత్తుమందుల వాడకం అధికమేనని ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

ఆ మధ్య టాలీవుడ్ డ్రగ్స్ దందా కేసు వెలుగులోకి రాగా, విచారణ జరిపిన అధికారులు, పలువురు సినీ ప్రముఖులను విచారించి, చివరికి వారి ప్రమేయం లేదని తేల్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిందితులు కాదని, బాధితులేనని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఆపై ఇంతకాలానికి మాధవీలత మరోసారి ఇదే దందాను గుర్తు చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Madhavi Latha
BJP
Tollywood
Drugs

More Telugu News