Telangana: స్నేహితుడితో కలిసి ప్రియురాలిపై అత్యాచారం, ఆపై హత్య.. యాదాద్రిలో దారుణం

young man raped his girl friend with his friend in Yadadri
  • ప్రియుడి మాటలు నమ్మి వెళ్లిన యువతి బలి
  • అనంతరం విషం తాగి నిందితుడి ఆత్మహత్య
  • మరో నిందితుడు రిమాండ్‌కు తరలింపు
ప్రియురాలు గత కొంత కాలంగా తనను దూరం పెడుతుండడంతో తట్టుకోలేకపోయిన ప్రియుడు, స్నేహితుడితో కలిసి ఆమె హత్యకు పథకం వేశాడు. మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం ఆమెను దారుణంగా హతమార్చారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కాటేపల్లికి చెందిన యువతి (25)కి అదే గ్రామానికి చెందిన మిర్యాల రవి (25)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

గత ఆరు నెలలుగా వీరు సన్నితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లుగా ఆమెకు 4 లక్షల రూపాయల వరకు ఇచ్చాడు. అయితే, గత కొంతకాలంగా యువతి తనను దూరం పెడుతుండడంతో రవి తట్టుకోలేకపోయాడు. దీంతో ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. ఇందుకు తన స్నేహితుడు చినపాక రవితేజ సాయం తీసుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా ఈ నెల 18న వలిగొండ మండలం లింగరాజుపల్లి శివార్లలోని వలిపాష గుట్ట వద్దకు రావాలని యువతికి చెప్పాడు. అతడి పథకం తెలియని ఆమె నమ్మి మధ్యాహ్న సమయంలో తన స్కూటీపై అక్కడకు చేరుకుంది.

రవితేజతో కలిసి బైక్‌పై అక్కడికొచ్చిన రవి మాట్లాడుకుందాం రమ్మంటూ ఆమెను గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడామెపై రవి, రవితేజ ఇద్దరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పొదల్లోకి తోసి చెట్ల కొమ్మలు కప్పేశారు. తర్వాత రవి తన బైక్‌పై వెళ్లగా, రవితేజ యువతి స్కూటీ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

కుమార్తె కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ నెల 20న భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో రవి మృతదేహం లభ్యమైంది. దీంతో యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని చంపేశారంటూ రవి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మరో కీలక విషయం బయటపడింది. యువతి  స్కూటీలో రవితేజ పెట్రోలు పోయించుకున్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తామిద్దరం కలిసి యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అతడిచ్చిన సమాచారంతో ఈ నెల 29న వలిపాష గుట్టపైకి వెళ్లిన పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. రవిది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారించామని, ఫోరెన్సిక్ నివేదికలో అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మరోవైపు, మరో నిందితుడు రవితేజ నుంచి యువతి స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.
Telangana
Yadadri Bhuvanagiri District
Lover
killed
Crime News

More Telugu News