Pattabhi: రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రూ.20 వేల అప్పు ఉంది: పట్టాభిరామ్ విమర్శలు

  • జగన్ పాలనలో ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైందన్న టీడీపీ నేత
  • రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారంటూ ఆరోపణ
  • గంటకు రూ.9 కోట్ల అప్పు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
TDP leader Pattabhi slams AP CM Jagan and finance minister Buggana

వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.25,654 కోట్ల చొప్పున రూ.1 లక్ష 28 వేల కోట్లు మాత్రమే అప్పు చేశారని, ఆ ఆప్పులను కూడా సక్రమంగా అభివృద్ధి, సంక్షేమాలకే ఖర్చు చేశారని వివరించారు.

జగన్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికే రూ.49 వేల 200 కోట్లు అప్పు చేసిందని తెలిపారు. గడచిన మూడు నెలల్లోనే రూ.33 వేల 300 కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. కేవలం 15 నెలల వ్యవధిలో రూ.97,118 కోట్లు అప్పులు చేసినట్టు కాగ్ స్పష్టంగా చెప్పిందని పట్టాభిరామ్ వెల్లడించారు. దీనిపై సీఎం జగన్, ఆర్థికమంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.20 వేల అప్పు ఉందని, ప్రతి కుటుంబానికి రూ.80 వేల అప్పులు మిగిలాయని విమర్శించారు. గంటకు రూ.9 కోట్లు అప్పు చేస్తూ ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తనకంటే గొప్ప ఆర్థికమంత్రి లేడని చెప్పుకునే బుగ్గన ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు.

More Telugu News