Hyderabad: తుపాకి గురిపెట్టి వ్యాపారి కిడ్నాప్.. రూ. 4 కోట్ల డిమాండ్!

Businessman Kidnapped demand 4 crore rupees
  • ఈ నెల 27న కొంపల్లి అండర్‌పాస్ సమీపంలో కిడ్నాప్
  • రూ. 2 లక్షలకు మించి ఇచ్చుకోలేనన్న వ్యాపారి
  • చేసేదిలేక వదిలేసి వెళ్లిపోయిన దుండగులు
తుపాకి చూపించి బెదిరించి ఓ వ్యాపారిని బెదిరించిన దుండగులు రూ. 4 కోట్లు డిమాండ్ చేసిన ఘటన ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఎస్.రామకృష్ణంరాజు గుండ్లపోచంపల్లి శివారులోని ఊర్జిత గ్రాండ్ విల్లాస్‌లో ఉంటూ నాచారంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న కారులో పరిశ్రమకు వెళ్తుండగా కొంపల్లి అండర్‌పాస్ సమీపంలో కాపుకాసిన ఆరుగురు దుండగులు ఆయనను అడ్డగించారు.

తుపాకి గురిపెట్టి కళ్లకు గంతలు కట్టి కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. రూ. 4 కోట్లు ఇస్తేనే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. అయితే, తన వద్ద అంత మొత్తం లేదని, రెండు లక్షల రూపాయలకు మించి ఇచ్చుకోలేనని చెప్పడంతో వారిమధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో మండిపడిన నిందితులు ఆయనపై చేయి చేసుకున్నారు. అయితే, ఏం చేసినా తాను రూ. 2 లక్షలకు మించి ఇవ్వలేనని చెప్పడంతో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రామకృష్ణంరాజును వదిలేశారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad
Kompally
Kidnap
Crime News

More Telugu News