Corona Virus: ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేందుకైనా, ఎవరికైనా ఇక అనుమతి అవసరం లేదు!

  • రెండు రోజుల్లో అన్ లాక్ 4.0 మొదలు
  • ఈ-పాస్ లు ఇక అవసరం లేదన్న కేంద్రం
  • కంటైన్ మెంట్ జోన్లలోని వారికి మాత్రమే నిబంధనలు
No Pass Needed for Inter State Travellers

అన్ లాక్ 4.0 మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న వేళ,కేంద్రం తదుపరి దశ సడలింపులపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందరూ సినిమా హాల్స్ కు అనుమతిని ఇస్తారని భావించినా, కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. తదుపరి దశ అన్ లాక్ లో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ప్రజా రవాణాపైనే. ఇప్పటివరకూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించాలంటే, సదరు రాష్ట్రాల అనుమతి తప్పనిసరికాగా, ఇకపై ఆ అవసరం లేదు. 

పలు రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఈ-పాస్ లు లేకుండానే సరిహద్దులను దాటి వెళ్లవచ్చని, ఇకపై ఏ రాష్ట్రం కూడా ఈ-పాస్ విధానాన్ని అమలు చేయరాదని కేంద్రం స్పష్టంగా తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అంతర్రాష్ట్ర ప్రయాణాలనుగానీ, ఓ రాష్ట్రంలోని రెండు జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలకు గానీ, ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కల్పించకూడదు. అదే సమయంలో సరకు రవాణానూ అడ్డుకోరాదు. కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలోని నివాసితులకు మాత్రం నిబంధనలు అమలులో ఉంటాయి. 

వివిధ అంతర్జాతీయ దేశాల నుంచి వచ్చే వారికి కూడా నిబంధనలు అమలవుతాయని కేంద్రం పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే వారికి, వారు వెళ్లే రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొవిడ్ నిబంధనలను పాటించాలని, క్వారంటైన్ నిబంధనలు వారికి తప్పనిసరని పేర్కొంది. కాగా, కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న కారణంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు, వ్యాపారాలకు, సరకు రవాణాకు ఇబ్బందులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News