Suresh Raina: సురేశ్ రైనా బంధువులపై దోపిడీ దొంగల దాడి.. ఒకరి మృతి!

  • యూఏఈ నుంచి రైనా తిరుగు ప్రయాణం
  • ఈ సీజన్ కు రైనా దూరమయ్యాడన్న సీఎస్కే
  • పఠాన్ కోట్ లో బంధువుల కుటుంబంపై దొంగలదాడి
Suresh Raina returns to India leaving his franchise at UAE

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఎడమచేతివాటం క్రికెటర్ సురేశ్ రైనా యూఏఈ నుంచి అర్థాంతరంగా భారత్ తిరిగి రావడం తీవ్ర చర్చనీయాంశం అయింది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా దీనిపై గోప్యత పాటించింది. రైనా వ్యక్తిగత కారణాలతోనే భారత్ తిరిగి వెళుతున్నాడని, ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి జట్టుకు దూరమవుతాడని ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల సీఎస్కే జట్టులో వరుసగా పలువురు కరోనా బారిన పడుతుండడంతో, రైనా మానసికంగా బాగా అప్సెట్ అయ్యాడనీ, అందుకే వెనక్కి వచ్చేశాడనీ క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

ఇదిలావుంచితే, పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాలోని థరియాల్ గ్రామంలో ఉంటున్న రైనా బంధువుల కుటుంబంపై ఇటీవల దోపిడీ దొంగలు దాడి చేశారు. వారం రోజుల కిందట రైనా బంధువైన అశోక్ కుమార్ అనే కాంట్రాక్టర్ కుటుంబంపై దాడి జరిగింది. కరుడుగట్టిన 'కాలే కచ్చేవాలా' దోపిడీ దొంగల ముఠా జరిపిన ఈ దాడిలో 58 ఏళ్ల అశోక్ కుమార్ మృతి చెందగా, నలుగురు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. దుండగులు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. కాగా, ఆ దొంగల దాడిలో మరణించిన అశోక్ కుమార్ క్రికెటర్ రైనాకు దగ్గరి బంధువు అని తెలిసింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, టెర్రస్ పై నిద్రిస్తున్న వారిపై దొంగలు దాడి చేసినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మృతుడు అశోక్ కుమార్ క్రికెటర్ రైనాకు బంధువు అని భావిస్తున్నామని, అంతకుమించి నిర్ధారించలేమని జిల్లా సీనియర్ ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు.

ఈ దాడిలో అశోక్ కుమార్ తల్లి సత్యా దేవి, భార్య ఆశా దేవి, కుమారులు అపిన్, కుశాల్ తీవ్రంగా గాయపడ్డారు. సత్యాదేవి కోలుకుని డిశ్చార్జి కాగా, భార్య ఆశాదేవి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  

More Telugu News