Kadapa District: పులివెందుల ఎస్సై సాహసం.. ప్రాణాలకు తెగించి, కారుపై వేలాడుతూ మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట!

Pulivendula SI Gopinath Reddy terrible fight with liquor mafia
  • ఓ కారులో అక్రమంగా మద్యం బాటిళ్లు
  • పోలీసులను భయపెట్టేందుకు నిందితుల ప్రయత్నం
  • కారుపై ఎస్సై వేలాడుతుండగా రెండు కి.మీ. పోనిచ్చిన నిందితులు
మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పులివెందుల ఎస్సై గోపీనాథరెడ్డి ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్థానిక రాఘవేంద్ర థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన ఓ వాహనంలో పెద్ద ఎత్తున మద్యం ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితులు వారిని భయపెట్టేందుకు కారును ముందుకు, వెనక్కి వేగంగా కదిలించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఎస్సై గోపీనాథ్‌రెడ్డి కారు ముందు భాగాన్ని పట్టుకున్నారు.

అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని నిందితులు కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. అప్రమత్తమైన ఎస్సై జారి కిందపడకుండా కారును గట్టిగా పట్టుకున్నారు. ఎస్సై కారుపై వేలాడుతుండగానే నిందితులు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కారును పోనిచ్చారు. ఈ క్రమంలో ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టారు.

ఈలోపు కారును అనుసరించిన పోలీసులు వాహనాన్ని అడ్డుకోవడంతో నిందితుల ఆటకు అడ్డుకట్ట పడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారు నుంచి 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి సాహసోపేతంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్సైపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Kadapa District
Pulivendula
SI Gopinath Reddy
Liquor

More Telugu News