Raghurama Krishnaraju: బాహుబలి రెండు సినిమాల్లో కట్టప్ప తప్పించుకున్నాడు కానీ, ఈ కట్టప్ప గ్యారంటీగా దొరుకుతాడు: రఘురామకృష్ణరాజు

  • ఆవ కుంభకోణాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్న రఘురామ
  • వరద ముంపు స్థలాలను కేటాయించడంపై అసంతృప్తి
  • ధనార్జనే లక్ష్యంగా కుంభకోణం అంటూ వ్యాఖ్యలు
Raghurama Krishnaraju explains about Kattappa in the wake of Aava lands issue

ఆవ భూముల కుంభకోణాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వరదలకు మునిగిపోయే స్థలాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా భూములు మోకాలి లోతు నీళ్లలో మునగడం చూస్తుంటామని, కానీ ఆవ భూముల్లో 20 అడుగుల కర్ర పెడితే అది కూడా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు.

ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని హైకోర్టు సీబీఐని కోరడం స్వాగతించదగ్గ పరిణామం అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ప్రజలను మోసం చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, అధికారులతో కుమ్మక్కైన వారందరికీ ఇదొక చెంపపెట్టు కావాలని అన్నారు. ఆవ భూముల్లో ప్రాథమిక పనులకు రూ.300 కోట్ల వ్యయం అవుతోందని తెలిపారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన లేఖ కూడా పక్కనబెట్టి ఆవ భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ కూడా విచారణలో వెల్లడవుతాయని తెలిపారు. ధనార్జనే లక్ష్యంగా ఆవ భూముల్లో కుంభకోణం జరిగిందనేది జగద్విదితం అని స్పష్టం చేశారు.

ఈ ఆవ భూముల వ్యవహారంలో ఓ కట్టప్ప ఉన్నాడని మనం ఇంతకుముందే చర్చించుకున్నామని, బాహుబలి రెండు సినిమాల్లో ఆ కట్టప్ప తప్పు చేసినా సరే బతికిపోయాడేమో కానీ, ఈ కట్టప్ప మాత్రం తప్పించుకోలేడని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఇప్పుడు అవినీతిపైనా కొత్త రూల్స్ వచ్చాయని, డబ్బులు ఇచ్చినవాడికి ఏడేళ్లు, తీసుకున్నవాడికి 35 ఏళ్లు శిక్ష అని పేర్కొన్నారని, అవినీతికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు.

More Telugu News