Donald Trump: అధ్యక్ష పదవికి పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్ స్వీకరించిన ట్రంప్!

Donald Trump accepts Republican Partys presidential nomination
  • రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ట్రంప్
  • ప్రత్యర్థి జోబైడెన్ ‌పై విరుచుకుపడిన అధ్యక్షుడు
  • తండ్రిపై ప్రశంసలు కురిపించిన ఇవాంకా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున నేడు అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. పార్టీ తరఫున వైట్‌హౌస్ సౌత్‌లాన్ నుంచి అధ్యక్ష పదవికి ఆయన నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా శ్వేతసౌథంలో నిర్వహించిన వర్చువల్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను గర్వంగా అంగీకరిస్తున్నట్టు తెలిపారు. అపూర్వమైన మద్దతుతో, గౌరవంతో ప్రజల ముందు నిలబడ్డానని పేర్కొన్నారు.

అమెరికా ఎన్నికల చరిత్రలో ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని అభివర్ణించారు. అన్ని భయాలు, ప్రమాదాల నుంచి అమెరికన్లను రక్షించినట్టు చెప్పారు. కొత్త శిఖరాలను అధిరోహించినట్టు పేర్కొన్నారు. 74 ఏళ్ల ట్రంప్ తన ప్రత్యర్థి జో బైడెన్ ‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్ల ఉద్యోగాలను నాశనం చేసే వ్యక్తని ఆరోపించారు. నల్లజాతీయుల కోసం బైడెన్ గత 47 ఏళ్లలో చేసినదానికంటే ఈ మూడేళ్లలో తాను చేసిందే ఎక్కువన్నారు.

ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా, తొలుత ట్రంప్‌ను ఆయన కుమార్తె ఇవాంకా పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఇవాంకా మాట్లాడుతూ.. వాషింగ్టన్‌ ట్రంప్ ను మార్చలేదని, ట్రంపే వాషింగ్టన్ ను మార్చారని అన్నారు. కరోనా కట్టడికి ట్రంప్ తీసుకున్న చర్యలు, ఆర్థిక విధానాలపై ప్రశంసలు కురిపించారు.
Donald Trump
America
presidential Elections
Joe Biden

More Telugu News