'ఫ్యామిలీ మేన్ 2'పై అప్ డేట్ వదిలిన సమంత

27-08-2020 Thu 22:03
  • తొలిసారిగా వెబ్ సీరీస్ లో సమంత
  • 'ఫ్యామిలీ మేన్ 2'లో కీలక పాత్ర
  • టెర్రరిస్టుగా నటిస్తున్న అందాలతార
  • మూడు భాషల్లో మొదలెట్టిన డబ్బింగ్
Samantha gives update on web series
కథానాయిక సమంత పెళ్లయ్యాక కూడా కథానాయికగా తన కెరీర్ని ఎంచక్కా కొనసాగిస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలు చేస్తూనే.. మరోపక్క అటు వెబ్ సీరీస్ లోకి కూడా ఎంటరయింది. హిందీలో రూపొందుతున్న 'ఫ్యామిలీ మెన్ 2' సీరీస్ లో తొలిసారిగా నటిస్తూ, కీలక పాత్ర పోషిస్తోంది. రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ లో తను టెర్రరిస్టుగా నెగటివ్ టచ్ తో కూడిన పాత్రలో నటిస్తోంది.

ఇక లాక్ డౌన్ కి ముందే ఈ సీరీస్ షూటింగ్ లో తను పాల్గొంది. కొన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన అప్ డేట్ ను తాజాగా సమంత వదిలింది. ఈ సీరీస్ కి తను డబ్బింగ్ చెప్పడాన్ని ప్రారంభించినట్టుగా సూచిస్తూ, డబ్బింగ్ థియేటర్లో వున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మామూలుగా సమంతకు గాయని చిన్మయి డబ్బింగ్ చెబుతుంటుంది. కానీ, ఈ సీరీస్ విషయంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తనే డబ్బింగ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో దీనిని స్ట్రీమింగ్ చేస్తారు.