Narendra Modi: రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో విదేశీ పెట్టుబడులు పెంచడానికి  కారణం ఇదే: మోదీ

  • ఇన్ని రోజులు అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉన్నాం
  • ఇప్పుడు దేశీయ తయారీని పెంచుతున్నాం
  • రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు వస్తాయి
This is the reason behind increasing FDIs in defence products manufacturing says Modi

దేశం స్వావలంబనను సాధించడానికే ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రధాని  మోదీ తెలిపారు. ప్రపంచ శాంతికి  కూడా ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధిస్తే హిందూ మహాసముద్రంలో భద్రత పటిష్టమవుతుందని చెప్పారు. రక్షణశాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇన్ని రోజులు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా భారత్ ఉందని... దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాలనే దిశగా ఆలోచన చేయలేదని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశీయ తయారీని పెంచామని, ప్రైవేటు రంగం సహకారంతో ఈ రంగానికి సాంకేతికతను అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అందుకే, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో 74 శాతం ఎఫ్డీఐలకు అనుమతించామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు వస్తాయని తెలిపారు. తమిళనాడులో డిఫెన్స్ కారిడార్ నిర్మాణం వేగంగా కొనసాగుతోందని... రానున్న ఐదేళ్లలో దీని కోసం రూ. 20 వేల కోట్లను వెచ్చించనున్నామని చెప్పారు.

దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకే రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించామని మోదీ అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలు... రానున్న రోజుల్లో మనతో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలకు ఢిఫెన్స్ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరించేందుకు దోహదపడతాయని చెప్పారు.

More Telugu News