Raghurama Krishnaraju: ఏపీ మద్యం బ్రాండ్లపై రఘురామకృష్ణరాజు సెటైర్లు

Raghurama Krishnaraju satirical comments on AP liquor brands
  • మద్యం తాగితే లివర్ చెడిపోతుందన్న ఎంపీ
  • మద్యం బ్రాండ్ల పేర్లపై రఘురామ వ్యాఖ్యలు
  • ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయోనంటూ ఆశ్చర్యం
మద్యం తాగితే లివర్ చెడిపోతుందన్నది జగమెరిగిన సత్యం అని నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో మద్యం బ్రాండ్లపై స్పందిస్తూ, ఆ ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ, విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నారు. ఏపీలో అమ్మే ఆ మద్యం బ్రాండ్లకు పేర్లు ఎలా పెడతారో, వాటి నాణ్యత ఏమిటో, వాటి రేట్లు ఏమిటో అర్థంకావడంలేదని తెలిపారు.

"దీని గురించి ఇటీవలే ఓ విజ్ఞుడు చెప్పాడు... పేరున్న బ్రాండ్లన్నీ పక్కరాష్ట్రాల్లో అమ్ముతున్నారని, ఏపీలో మాత్రం గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, నోబెల్ ప్రైజ్, భారతరత్న వంటి బ్రాండ్లు అమ్ముతున్నారని అన్నాడు. పక్కరాష్ట్రాల్లో దొరుకుతున్న మద్యం రోజుకు ఓ క్వార్టర్ తాగితే 20 ఏళ్లలో లివర్ చెడిపోతుంది అనుకుంటే, మన రాష్ట్రంలో దొరికే మద్యం ఒక క్వార్టర్ తాగితే రెండు, మూడేళ్లలోనే హరీ మంటారని చాలామంది అంటున్నారు. ఈ బ్రాండ్ల రుచి నేనెప్పుడూ చూడలేదు. నాకైతే తెలియదు. ప్రజలు అనుకుంటున్నమాట.

మద్యంతో రూ.22 వేల కోట్ల రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా ప్రజాధనమైనా అయ్యుండాలి, లేకపోతే అమ్మఒడి సొమ్మో, లేక రైతు భరోసానో, రాజన్న, జగనన్న స్కీముల్లోంచి అయినా వచ్చుండాలి. మరి, అంత ఆదాయం వస్తున్నప్పుడు ప్రజల ఆయుర్దాయం పెంచే బ్రాండ్లు తెస్తే బాగుంటుంది. మద్య నిషేధం అంటున్నారు కాబట్టి పూర్తిగా అమలు చేస్తే మంచిది. అలాకాకుండా ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ఆయుర్దాయం తగ్గించవద్దు" అంటూ వ్యాఖ్యానించారు.
Raghurama Krishnaraju
Liquor Brands
Andhra Pradesh
YSRCP

More Telugu News