Pulwama: మమ్మల్ని ఇరికించేందుకు భారత్ యత్నిస్తోంది: పాకిస్థాన్ మండిపాటు

  • పుల్వామా ఘటనపై 13,500 పేజీల ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన ఎన్ఐఏ
  • స్వప్రయోజనాల కోసం భారత్ యత్నింస్తోందన్న పాక్
  • పాకిస్థాన్ పై వ్యతిరేక ప్రచారం చేస్తోందని మండిపాటు
India is intentionally blaming us says Pakistan

జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ మంగళవారం నాడు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సహా మరో 19 మందిపై 13,500 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఇతర నిందితులలో మసూద్ అజార్ సోదరులు అబ్దుల్ రవూఫ్, అమర్ అల్వీ, మేనల్లుడు ఉమర్ ఫరూఖ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్పందిస్తూ భారత్ పై విషం చిమ్మింది.

తమ దేశాన్ని ముద్దాయిగా చూపించేందుకు భారత్ కొంటె ప్రయత్నం చేస్తోందని పాక్ వ్యాఖ్యానించింది. ఛార్జి షీట్ లో పేర్కొన్న ఆధారాలను నిరూపించడంలో భారత్ విఫలమైందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ సంకుచిత మనస్తత్వానికి ఇదొక నిదర్శనమని చెప్పింది. వారి స్వప్రయోజనాల కోసమే భారత్ ఇలాంటి చర్యలకు దిగుతోందని దుయ్యబట్టింది. అధికార పార్టీ బీజేపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఛార్జ్ షీట్ ను రూపొందించారని ఆరోపించింది.

పుల్వామా ఘటనలో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాకిస్థాన్ పై భారత్ వ్యతిరేక ప్రచారం చేస్తోందని మండిపడింది. అంతర్జాతీయ సమాజం ముందు తమను ఇరికించేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టింది. 2019లో తమపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడికి దిగితే... తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపింది. తమ దాడిలో భారత్ కు చెందిన ఒక యుద్ధ విమానం కూలిపోయిందని... ఒక పైలట్ (అభినందన్)ను తాము పట్టుకున్నామని చెప్పింది. భారత్ రెచ్చగొట్టే ప్రయత్నాలకు దిగినా... తాము ఆ పైలట్ ను విడిచి పెట్టామని చెప్పుకొచ్చింది. శాంతి కోసమే తాము ఆ పని చేశామని తెలిపింది.

More Telugu News