GVL Narasimha Rao: భారతదేశం వరవరరావు లాంటి అరాచకవాదులకు మద్దతిస్తుందా?: జీవీఎల్ వ్యాఖ్యలు

BJP Rajyasabha member GVL Narasimharao terms Varavararao an urban naxalite
  • వరవరరావును అర్బన్ నక్సలైట్ గా పేర్కొన్న జీవీఎల్
  • మానవ హక్కుల ఉద్యమకారుడు ఎలా అవుతాడంటూ వ్యాఖ్యలు
  • కరోనా బారినపడి ఆసుపత్రిపాలైన వరవరరావు
విరసం నేత వరవరరావుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరవరరావును అర్బన్ నక్సలైట్ (ప్రజల మధ్యన తిరుగాడే నక్సలైట్) అని అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని కొందరు మానవ హక్కుల ఉద్యమకారుడు అంటున్నారని, అలాంటివాళ్లు గతంలో వరవరరావు ఏమన్నాడో చూడాలని హితవు పలికారు.

"మనదేశానికి పార్లమెంటరీ వ్యవస్థ తగింది కాదని, అనుసరించాల్సిన మార్గం ఏదైనా ఉందంటే అది నక్సల్బరీ ఉద్యమం మాత్రమేనని, చేతుల్లోకి ఆయుధాలు తీసుకోవడమేనని వరవరరావు గతంలో అన్నారు. ఇలాంటి అరాచకవాదులకు భారతదేశం మద్దతు ఇస్తుందా?" అని జీవీఎల్ ప్రశ్నించారు.

అంతేకాదు, గతంలో వరవరరావు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు కథనాన్ని కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా, భీమా కోరేగావ్ కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావు ప్రస్తుతం ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇటీవల కరోనా పాజటివ్ అని తేలడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నివారాల కిందటే వరవరరావును ముంబయి తలోజా జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.
GVL Narasimha Rao
Varavara Rao
Urban Naxal
Human Rights Activist
BJP
India

More Telugu News