Suriya: హీరో సూర్య నిర్ణయంలో తప్పేముంది?: నిర్మాత అశ్వనీదత్

  • ఓటీటీలో తన సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సూర్య
  • తాము నష్టపోతామంటున్న తమిళ థియేటర్ల యాజమాన్యాలు
  • ప్రేక్షకుల ఆరోగ్యంతో చెలగాటం వద్దన్న అశ్వనీదత్
There is no wrong in Suriyas decision says Ashwini Dutt

తన తాజా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ప్రముఖ తమిళ హీరో సూర్య తీసుకున్న నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువు అయింది. సూర్యలాంటి స్టార్లు వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తే తమ పరిస్థితి ఏమిటని తమిళనాడులోని థియేటర్ల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, ఈ విషయంలో ప్రముఖ తమిళ దర్శకనిర్మాత భారతీరాజా సూర్యకు మద్దతుగా నిలిచారు. సూర్య గురించి కామెంట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని... సూర్య కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు కావాలనే యత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సూర్య సినిమా 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులో కూడా విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. సూర్య నిర్ణయంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జనవరి వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆ తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని చెప్పారు. ఓటీటీలో సినిమాను విడుదల చేయాలనే సూర్య నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సూర్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఓటీటీలో సినిమాలు విడుదలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

More Telugu News