Corona Virus: తెలంగాణ పోలీసులను కలవరపరుస్తున్న కరోనా.. పదిశాతం మందికి వైరస్

5684 police personnel infected to corona in Telangana
  • కరోనా బారినపడిన 5,684 మంది పోలీసులు
  • 43 మంది పోలీసుల మృతి
  • అత్యధికంగా హైదరాబాద్‌లో 1967 పోలీసులకు సోకిన మహమ్మారి
తెలంగాణ పోలీసు శాఖను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. కరోనా పోరులో ముందున్న పోలీసులు వరుసపెట్టి కరోనా బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాను నియంత్రించేందుకు మార్చిలో కేంద్రం లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 10 శాతం మంది పోలీసులు వైరస్ బారినపడ్డారు.

పోలీసు శాఖలోని అన్ని విభాగాలలోను కలుపుకుని మొత్తం 54 వేల మంది పోలీసులు ఉన్నారు. ఈ నెల 25 నాటికి మొత్తం 5,684 మంది పోలీసులకు వైరస్ సోకింది. అంటే దాదాపు 10 శాతం మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. వీరిలో ఇప్పటి వరకు 2,284 మంది డిశ్చార్జి కాగా 3,357 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే, ఇప్పటి వరకు 43 మంది కరోనా కాటుకు బలయ్యారు. తాజాగా కరోనాతో మృతి చెందిన జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 44కు పెరుగుతుంది. అయితే, అదే సమయంలో పెద్ద సంఖ్యలో కోలుకుంటుండడం ఊరటనిచ్చే అంశం.

ఇక, హైదరాబాద్‌లో అత్యధికంగా 1,967 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. వీరిలో 801 మంది చికిత్స పొందుతుండగా, 1,053 మంది డిశ్చార్జ్ అయ్యారు. 23 మంది పోలీసులు మరణించారు. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ నిలిచింది. అక్కడ 526 మంది పోలీసులకు కరోనా సంక్రమించగా, 361 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతి చెందగా, 163 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Corona Virus
Hyderabad
Warangal
Police force
Telangana

More Telugu News