Chandrababu: ఓంప్రతాప్ కాల్ లిస్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి: డీజీపీకి చంద్రబాబు లేఖ

  • రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వేధింపులు ఎక్కువయ్యాయి
  • వైసీపీ నేతలకు భయపడి ఓంప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా?
Chandrababu writes a letter to DGP

చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు ఓంప్రతాప్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనను మరువక ముందే... చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడు ఓంప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా? అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని... అందువల్లే ఇలాంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. ఓంప్రతాప్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. మృతుడి కాల్ లిస్ట్ ను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News