china: మన రెండు దేశాల ఘనమైన చరిత్రలో అదో చిన్న ఘటన మాత్రమే: చైనా

  • జూన 15 ఘటనలు ప్రస్తావించిన చైనా ప్రతినిధి
  • విభేదాలు పరిష్కరించుకుని ముందుకు సాగాలి
  • వేల ఏళ్ల చరిత్రను ప్రస్తావించిన సున్ వీడోంగ్
China envoy Comments on clash With India

ఈ సంవత్సరం జూన్ 15న భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ఘటనను చైనా ప్రతినిధి సున్ వీడోంగ్ చాలా చిన్నదైనదని అభివర్ణించారు. తాజాగా నిర్వహించిన చైనా - ఇండియా యూత్ వెబినార్ లో మాట్లాడిన ఆయన, ఇదే అవాంఛనీయ ఘటనని, ఇరు దేశాల ఘనమైన చరిత్రలో అతి చిన్నదని, విభేదాలు పరిష్కరించుకుని, ముందుకు సాగాల్సిన సమయం ఇదని అన్నారు.

ఆగస్టు 18న ఈ వెబినార్ జరుగగా, నిన్న చైనా ఎంబసీ ఆయన ప్రసంగాన్ని విడుదల చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్యా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చైనా తక్షణం స్పందించాలని, సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తున్న వేళ, సున్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఆయన ప్రసంగం యావత్తూ, రెండు దేశాల మధ్యా ఉన్న చరిత్ర గురించే ఎక్కువ సేపు సాగింది. వేలాది ఏళ్ల చరిత్ర, పౌర సమాజం, రెండు దేశాల మధ్యా రాకపోకలు, ప్రజల మధ్య సహకారం తదితరాలను ప్రస్తావించిన ఆయన, బేసిక్ చైనా విదేశాంగ విధానం, ఇండియాకు సంబంధించినంత వరకూ ఏ మాత్రమూ మారలేదని స్పష్టం చేశారు.

 జూన్ 15 నాటి ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, "ఎంతో కాలం క్రితమేమీ కాదు. ఇటీవలే దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనే ఇది. సరిహద్దుల్లో చైనాగానీ, ఇండియాగానీ దీన్ని ఆహ్వానించలేదు. దీన్నిప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మన దేశాల చరిత్రలో ఇది ఓ అతి చిన్న ఘటనగానే తీసుకోవాలి. ఇండియాను ప్రత్యర్థిగా చైనా చూడటం లేదు. ఇదే సమయంలో భారత్ నుంచి ముప్పు ఉందని కూడా అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు.

సరిహద్దుల్లో నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలను ఇరు దేశాలూ కలిసి వెతుక్కోవాల్సిన అవసరం ఉందని, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాల మెరుగునకు కృషి చేయాలని అన్నారు. కాగా, చైనా అధికారి ప్రసంగంపై భారత్ ఇంకా స్పందించాల్సి వుంది.

More Telugu News