AP High Court: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసు: డాక్టర్ రమేశ్ బాబుపై చర్యల నిలిపివేతకు హైకోర్టు ఆదేశం

  • విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాదం
  • ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు
  • కలెక్టర్, సబ్ కలెక్టర్ లను ఎందుకు బాధ్యుల్ని చేయలేదన్న కోర్టు
High Court gives stay on Swarna Palace fire accident case

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం 10 మందిని కబళించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రమాదం కేసులో రమేశ్ ఆసుపత్రి యాజమాన్యంపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై హైకోర్టులో జరిగిన విచారణలో రమేశ్ ఆసుపత్రి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అనేక ఏళ్లుగా స్వర్ణ ప్యాలెస్ లో కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఆ హోటల్లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు అధికారులు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు.

దీనిపై స్పందించిన హైకోర్టు... అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా బాధ్యులే కదా అని పేర్కొంది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా అనుమతించిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్ఓలను ఎందుకు బాధ్యులుగా చేయలేదని ప్రశ్నించింది. స్వర్ణ ప్యాలెస్ ను గతంలో ఎయిర్ పోర్టు క్వారంటైన్ సెంటర్ గా నిర్వహించారా? లేదా? అని అడిగింది.

ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, ప్రస్తుతం స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసు విచారణ దశలో ఉందని చెప్పారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు, రమేశ్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేశ్ బాబుపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

More Telugu News