Swarna Palace Hotel: స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున అందించిన ఏపీ మంత్రులు

  • ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం
  • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్
  • జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న మంత్రి ఆళ్ల నాని
AP Ministers gives checks to family members of  Swarna Palace victims

విజయవాడ నగరంలో ఇటీవల స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఏపీ మంత్రులు రూ.50 లక్షల చొప్పున చెక్కులను పరిహారంగా అందించారు.

విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, కుటుంబ పెద్దలు చనిపోవడంతో ఆదరణ లేకుండా పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్ మానవత్వంతో రూ.50 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారని, ఆయన ఇచ్చిన హామీ మేరకు ఇవాళ మృతుల కుటుంబాలకు పరిహారం అందించామని వెల్లడించారు.

విజయవాడకు చెందిన ఆరుగురికి, మచిలీపట్నంకు చెందిన ముగ్గురికి చెక్ లు ఇచ్చామని, భర్తను కోల్పోయిన కందుకూరుకు చెందిన యువతి గర్భవతి అయినందున ఆమె ఇంటికి వెళ్లి చెక్ అందిస్తామని మంత్రి వివరించారు. కాగా, ఈ కార్యక్రమంలో మరో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, మల్లాది విష్ణు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పార్టీ నేత సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

More Telugu News