Karnataka: ఎవరైనా రావచ్చు, పోవచ్చు... క్వారంటైన్ నిబంధన, రిజిస్ట్రేషన్ ను రద్దు చేసిన కర్ణాటక!

Karnataka Removes All Travel Rules for Interstate Passengers
  • ఇతర రాష్ట్రాల నుంచి వస్తే జాగ్రత్తగా ఉండాలి
  • విదేశాల నుంచి వస్తే మాత్రమే క్వారంటైన్
  • నిబంధనలు మార్చామన్న ఆరోగ్య శాఖ కార్యదర్శి
కరోనా వ్యాప్తి దృష్ట్యా, మార్చిలో విధించిన ప్రయాణ ఆంక్షల్లో మరింటిని కర్ణాటక ప్రభుత్వం సవరించింది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రయాణికులపై ఏ విధమైన ఆంక్షలూ ఉండబోవని, సరిహద్దుల్లో కేవలం స్క్రీనింగ్ మాత్రమే జరుగుతుందని, 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను తొలగిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జావేద్ అఖ్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోమ్ శాఖ నుంచి అందిన ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఇకపై కర్ణాటక రాష్ట్రానికి వచ్చే వారు సేవా సింధు పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని ఆయన వెల్లడించారు. అన్ లాక్-3.0లో భాగంగా ప్రయాణికులను అడ్డుకోవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు తమ సరిహద్దులను తరచూ మూసివేస్తున్నాయని, వైరస్ వ్యాప్తి పేరిట వారు తీసుకుంటున్న చర్యలతో రవాణా, వస్తు సరఫరాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కేంద్ర హోమ్ శాఖ విమర్శించిన సంగతి తెలిసిందే.

సవరించిన నిబంధనలు అన్ని రాష్ట్రాల వారికీ వర్తిస్తాయని, వ్యాపారపరమైన పనుల నిమిత్తం వచ్చేవారు, విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చే కార్మికులు ఇకపై నిరభ్యంతరంగా రావచ్చని, ఎన్నాళ్లయినా ఉండవచ్చని, ఎక్కడికైనా వెళ్లవచ్చని జావేద్ అఖ్తర్ తెలిపారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటున్న అన్ని జిల్లాల అధికారులకూ సమాచారాన్ని పంపామని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఇవి వర్తించవని, వారు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని అన్నారు. 

పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు వచ్చిన తరువాత 14 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని కన్సల్ట్ చేయాలని, ఆప్తమిత్ర లేదా 14410 నంబరుకు కాల్ చేయాలని ఆయన సూచించారు. సరిహద్దుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే, సెల్ఫ్ ఐసోలేషన్ తప్పనిసరని, కరోనా సోకకుండా రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ రెండు అడుగుల భౌతిక దూరం, ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని ఆయన వెల్లడించారు.
Karnataka
Inter State
Travel
Quarentine

More Telugu News