ప్రియుడి మోసంతో ప్రియురాలి ఆత్మహత్య.. పోలీసు కేసు భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

25-08-2020 Tue 08:30
  • గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో ఘటన
  • పెళ్లికి దాటవేస్తూ వచ్చిన యువకుడు
  • మనస్తాపంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Girl Suicide after lover refused to marry

ప్రియుడు చేసిన మోసంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు కేసు నమోదు చేస్తారన్న భయంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.  గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని నందిగామలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సయ్యద్ మహబూబ్బి (21), కొమెరపూడికి చెందిన షేక్ ఇస్మాయేలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఇస్మాయేలు మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ నెల 17న మరోమారు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, ఇస్మాయేలు నిరాకరించాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహబూబ్బి పురుగు మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఇస్మాయేలు తనపై పోలీసులు ఎక్కడ కేసు నమోదు చేస్తారోనన్న భయంతో ఈ నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, యువతి ఆరోగ్యం విషమించడంతో గుంటూరులోని సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నిన్న మృతి చెందింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో ఇస్మాయేలు, అతడి తండ్రి హుస్సేన్‌లపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.