America: అమెరికాలోనూ ప్లాస్మా చికిత్స.. ఎఫ్‌డీఏ అత్యవసర ఆమోదం

  • తన విజయావకాశాలను నీరుగారుస్తోందంటూ విరుచుకుపడిన ట్రంప్
  • ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ప్లాస్మా చికిత్సకు ఎఫ్‌డీఏ అనుమతి
  • 70 వేల మందికిపైగా కరోనా రోగులకు ఇప్పటికే ప్లాస్మా చికిత్స
FDA Green Signals to Plasma Therapy

కరోనా బారినపడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించి చేసే ప్లాస్మా చికిత్సకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. అత్యవసర ప్రాతిపదికన వాడుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ విధానం వల్ల ముప్పు కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. కరోనా బాధితుల చికిత్స కోసం కాన్వలసెంట్ ప్లాస్మాను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు గతంలో అత్యవసర అనుమతి ఇచ్చామని, ప్రయోగశాలల్లో వెలువడిన శాస్త్రీయ డేటాను విశ్లేషించిన అనంతరరం చికిత్స విధానంగా దీనిని అనుమతించాలని ఇప్పుడు నిర్ణయించినట్టు వివరించింది. దేశంలో 70 వేల మందికిపైగా కరోనా రోగులకు ఇప్పటికే ఈ చికిత్స అందించినట్టు తెలిపింది.

త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన విజయావకాశాలను నీరుగార్చేందుకు ఎఫ్‌డీఏ ప్రయత్నిస్తోందని, అందుకనే వ్యాక్సిన్లు, ఔషధాలు, ప్లాస్మా థెరపీ వంటి చికిత్స విధానాలకు అనుమతి ఇవ్వడం లేదని ట్రంప్ ఆదివారం విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ప్లాస్మా థెరపీతో అత్యవసర చికిత్సకు అనుమతులు ఇవ్వడాన్ని ట్రంప్ స్వాగతించారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్లాస్మాతో చికిత్స చేస్తే రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని తమ డేటా చెబుతోందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజర్ తెలిపారు.

More Telugu News