Congress: సీడబ్ల్యూసీ నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ రాహుల్ నాయకత్వాన్నే కోరుతున్నారు: కేసీ వేణుగోపాల్

KC Venugopal says everyone wants Rahul Gandhi as party chief
  • ఇవాళ ఢిల్లీలో 7 గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం
  • మరికొన్నాళ్ల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా
  • వచ్చే ఏఐసీసీ సమావేశంలో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే అవకాశం
సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరికొంతకాలం కొనసాగనున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సోనియా... ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు అశక్తత వ్యక్తం చేసినా మరో మార్గం లేకపోయింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కొత్త నాయకత్వంపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు.

దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని సీనియర్లు కోరారని వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం 7 గంటల పాటు జరిగిందని తెలిపారు. 23 మంది సీనియర్లు రాసిన లేఖపై సీడబ్ల్యూసీ చర్చించిందని, సంస్థాగత మార్పుపై నిర్ణయం తీసుకునేందుకు సోనియాకు సీడబ్ల్యూసీ పూర్తి అధికారం ఇచ్చిందని వివరించారు. సీడబ్ల్యూసీ నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ రాహుల్ నాయకత్వాన్నే కోరుతున్నారని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ నెల 20న సోనియా గాంధీ లేఖ రాశారని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని కోరారని తెలిపారు.

అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ, కాంగ్రెస్ అనేది పెద్ద కుటుంబం అని, భేదాభిప్రాయాలు సహజమని అన్నారు. లేఖ రాసిన నేతలపై ఎలాంటి కోపం లేదని సోనియా చెప్పారని వెల్లడించారు. దేశ సమస్యలపై గళమెత్తాలని కాంగ్రెస్ సభ్యులను సోనియా కోరారని వివరించారు. అవకాశం చూసుకుని ఏఐసీసీ పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తామని సూర్జేవాలా చెప్పారు. ఏఐసీసీ సమావేశంలోనే అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని అని స్పష్టం చేశారు.
Congress
Rahul Gandhi
Sonia Gandhi
CWC
KC Venugopal

More Telugu News