Avanthi Srinivas: రఘురామకృష్ణరాజు మేకతోలు కప్పుకున్న నక్క: మంత్రి అవంతి

AP Minister Avanthi Srinivas warns Raghurama Krishnaraju over Thotlakonda
  • సీఎం జగన్ నిర్ణయాలపై కేంద్రానికి లేఖ రాసిన రఘురామ
  • విశాఖతో సంబంధం లేకుండా లేఖ ఎలా రాస్తారన్న అవంతి
  • ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలంటూ వార్నింగ్
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తొట్లకొండ వంటి చారిత్రక ప్రదేశాల్లో ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మించడం మానుకోవాలంటూ ఇటీవల రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడంపై అవంతి మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు తొట్లకొండ ఎక్కడుందో రఘురామకృష్ణరాజుకు తెలుసా? అని ప్రశ్నించారు. తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడతారని నిలదీశారు.

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారంటూ ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణరాజు మేకతోలు కప్పుకున్న నక్క అని, విశాఖతో సంబంధంలేని ఆయన కేంద్రానికి ఎలా లేఖ రాస్తారంటూ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని అవంతి హెచ్చరించారు. జగన్ భిక్షతో గెలిచిన రఘురామకృష్ణరాజుకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ నిర్ణయాలపై రఘురామ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తొట్లకొండలో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ ను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు.
Avanthi Srinivas
Raghurama Krishnaraju
Thotlakonda
Chandrababu
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News