Bhanu Prakash: ప్రపంచ విజేతగా నిలిచిన హైదరాబాద్ మానవ కంప్యూటర్ భానుప్రకాశ్

  • లండన్ లో వరల్డ్ మెంటల్ కాలిక్యులేషన్స్ టోర్నీ
  • 13 దేశాల నుంచి వచ్చిన 30 మంది పార్టిసిపెంట్స్ తో పోటీ
  • ఐదేళ్ల వయసు నుంచే మ్యాథ్స్ లో జీనియస్ గా గుర్తింపు
Human computer Bhanu Prakash wins world tittle in London

హైదరాబాదుకు చెందిన నీలకంఠ భానుప్రకాశ్ నడిచే కంప్యూటర్ అని చెప్పవచ్చు. గణితంతో కూడిన వ్యవహారాలకు పెన్ను, పేపర్ లేక కాలిక్యులేటర్ లేందే పనిజరగదు అని భావించే ఈ రోజుల్లో 20 ఏళ్ల భానుప్రకాశ్ మనసులోనే ఎంత పెద్ద లెక్కనైనా ఇట్టే చేసేస్తూ మానవ కంప్యూటర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజి నుంచి మ్యాథ్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ కుర్రాడు లండన్ లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచాడు.

భారత్ నుంచి ఈ టైటిల్ నెగ్గిన తొలి వ్యక్తి భానుప్రకాశ్ ఒక్కడే. 13 దేశాల నుంచి వచ్చిన 30 మంది పార్టిసిపెంట్స్ తో పోటీపడిన ఈ తెలుగుతేజం తొలి ప్రయత్నంలోనే అందరినీ ఓడించి టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఐదేళ్ల వయసు నుంచే గణితంలో అద్భుతాలు చేస్తూ వండర్ కిడ్ గా పేరుతెచ్చుకున్న భానుప్రకాశ్ అబాకస్ విద్యలోనూ ప్రపంచస్థాయిలో విజేతగా నిలిచాడు. భానుప్రకాశ్ ఇప్పటివరకు... ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేషన్, పవర్ మల్టిప్లికేషన్ రికార్డ్, ద సూపర్ సబ్ ట్రాక్షన్ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు.

ఎంత సాధించినా ఒదిగి ఉండడం ముఖ్యమని భావించే ఈ హైదరాబాదీ... తనకు రికార్డుల పట్ల మక్కువ లేదని, గణితంలో నిపుణులతో, మానవ కాలిక్యులేటర్లతో ఓ వర్గాన్ని తయారుచేయాలన్నదే తన సంకల్పం అని స్పష్టం చేశాడు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ల నుంచి కూడా గణిత మేధావులు వచ్చేలా చూడడం తన లక్ష్యమని వివరించాడు.

More Telugu News